has gloss | tel: గొట్టిపాటి బ్రహ్మయ్య (1889-1984) రైతు పెద్ద అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పని చేసారు. 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు. స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమం, సైమన్ కమిషను బహిష్కరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు. స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 25, 1964 నుండి జూన్ 30, 1968 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా పని చేసారు. నా జీవన నౌక పేరుతో వెలువడిన ఆయన ఆత్మకథ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది. |