has gloss | tel: అరకు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోకసభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోకసభ నియోజకవర్గంగా పేరుగాంచింది. పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. |